అసలు ఈ బ్లాగు ఎందుకు మొదలెట్టానంటే (అంటే నేపథ్యం అన్నమాట)....
అమెరికాలో ఉన్నన్నాళ్ళూ పవన్ పుణ్యమా అని తిండికి లోటు లేకుండా గడిచిపోయింది. ఇప్పుడు హైదరాబాదుకు వచ్చేసాక మా పెదనాన్నగారి వాళ్లింట్లో ఉంటున్నా కాబట్టి ఇప్పుడు కూడా తిండికి ఢోకా లేకుండా గడిచిపోతోంది. కానీ అన్నిరోజులూ ఒకేలా ఉండవు కదా... భవిష్యత్తులో ఎక్కడికెళ్ళాల్సొస్తుందో ఏమో, అక్కడ మళ్లీ పవన్ లాంటివాళ్ళు దొరుకుతారో లేదో అన్న బెంగ పట్టుకుంది. ఇంట్లో పెళ్ళి చేసుకో అని పోరెడుతున్నారుగానీ చేసుకుంటే నిండా మునిగిపోతా. తాను దూర కంత లేదు మెడకో డోలు అన్నట్టు నాకే వంట రాదు, ఇంకొకరికి వండిపెట్టడమా (ఈ రోజుల్లో అమ్మాయిలకు వంట ఎలాగూ రాదు కదా). ఇలా కాదు తిప్పలు పడైనా వంటల్లో చేతులూ, కాళ్ళూ పెట్టాలని నిర్ణయించుకున్నాను. నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఉండడానికి, చేసినవాటిని మర్చిపోకుండా ఉండడానికి ఈ బ్లాగు మొదలెట్టాను. అదన్నమాట.
ఇకనుంచీ ఈ బ్లాగులో ఆలు వేపుడు, దోసకాయ పప్పులాంటి సింపుల్ వంటలు మొదలుకుని కంద బచ్చలి, అరటి ఆవ కూరల్లాంటి అడ్వాన్స్డ్ వంటల వరకూ అన్నిరకాల రెసిపీలూ దర్శనమిస్తాయి. కంగారు పడకండి... బంగాళా భౌభౌ, చికినోవా ఉష్టిమం లాంటి వెరైటీలు ఉండవులెండి.
ప్రస్తుతం కెమెరా లేదుగానీ, వచ్చాక ప్రాసెస్ మొత్తం ఫోటోలు, వీడియోల రూపంలో అప్‌లోడ్ చేస్తా.
0 comments:
Post a Comment